దిల్లీ: గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ సినీ రంగానికి ప్రాతినిధ్యం వహించిన తొలి దర్శకుడిగా చరిత్ర సృష్టించారు. సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ శకటాన్ని ఆయన ‘భారత కథ’ థీమ్‌తో రూపొందించారు. భారతీయ కళా సంప్రదాయాల ఆవిర్భావం నుంచి ఆధునిక సినిమాల వరకు సాగిన ప్రయాణాన్ని ఇందులో అద్భుతంగా ఆవిష్కరించారు. ‘భారత కథ: శ్రుతి, కృతి, దృష్టి’ పేరుతో 3 భాగాలుగా రూపొందిన ఈ శకటం ప్రేక్షకులను ఆకట్టుకుంది. శకటం ప్రధాన భాగంలో ‘బాక్సాఫీసు’ గుర్తుతో పాటు ‘కమింగ్ సూన్’ అక్షరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.