తిరుమల శ్రీవారిని భక్తితో కొలుస్తూ ఆలపించే పవిత్ర దైవ నామాలు, భక్తి గీతాలను వైసీపీ నేతలు పేరడీలుగా పాడటాన్ని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. నెల్లూరులో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో వైసీపీ నేతలు వ్యవహరించిన తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై స్పందించాలని పార్టీ నేతలకు పవన్ దిశానిర్దేశం చేశారు. ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీ.. రాజకీయాల కోసం పవిత్ర గోవింద నామాలను పేరడీగా చేస్తూ భక్తుల మనోభావాలను కించపరిచింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్నవారు వ్యవహరించిన తీరు ధార్మిక విశ్వాసాలకు విఘాతం కలిగించేలా ఉంది.